عربيEnglish

The Noble Qur'an Encyclopedia

Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languages

The Smoke [Ad-Dukhan] - Telugu translation - Abder-Rahim ibn Muhammad

Surah The Smoke [Ad-Dukhan] Ayah 59 Location Maccah Number 44

హా - మీమ్[1].

స్పష్టమైన ఈ గ్రంథం (ఖుర్ఆన్) సాక్షిగా![1]

నిశ్చయంగా, మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) శుభప్రదమైన రాత్రిలో అవతరింపజేశాము.[1] నిశ్చయంగా, మేము (ప్రజలను) ఎల్లప్పుడూ హెచ్చరిస్తూ వచ్చాము. [2]

దానిలో (ఆ రాత్రిలో), ప్రతి విషయం వివేకంతో విశదీకరించ బడుతుంది;

మా ఆజ్ఞానుసారంగా, నిశ్చయంగా, మేము (సందేశహరులను) పంపుతూ వచ్చాము.

నీ ప్రభువు తరఫు నుండి కారుణ్యంగా! నిశ్చయంగా, ఆయనే అంతా వినేవాడు, సర్వజ్ఞుడు.

భూమ్యాకాశాలకు మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువు. మీకు వాస్తవంగా నమ్మకమే ఉంటే!

ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయనే జీవితాన్ని ప్రసాదించేవాడు మరియు ఆయనే మరణాన్ని ఇచ్చేవాడు. ఆయన మీ ప్రభువు మరియు పూర్వీకులైన మీ తాతముత్తాతల ప్రభువు.[1]

అసలు! వారు సందేహంలో పడి ఆటల్లో మునిగి ఉన్నారు (పరిహసిస్తున్నారు).

కావున నీవు ఆకాశం నుండి స్పష్టమైన పొగ వచ్చే దినం కొరకు నిరీక్షించు!

అది మానవులందరినీ క్రమ్ముకుంటుంది. అదొక బాధాకరమైన శిక్ష.

(అప్పుడు వారు ఇలా వేడుకుంటారు): "ఓ మా ప్రభూ! ఈ శిక్షను మా నుండి తొలగించు. నిశ్చయంగా, మేము విశ్వాసుల మవుతాము."

ఇక (అంతిమ ఘడియలో) హితబోధ స్వీకరించటం వారికి ఎలా పనికి రాగలదు? వాస్తవానికి వారి వద్దకు (సత్యాన్ని) స్పష్టంగా తెలియజేసే ప్రవక్త వచ్చి ఉన్నాడు;

అప్పుడు వారు అతని నుండి మరలి పోయారు మరియు ఇలా అన్నారు: "ఇతను ఇతరుల నుండి నేర్చుకున్నాడు, ఇతనొక పిచ్చివాడు!" [1]

వాస్తవానికి మేము కొంతకాలం వరకు ఈ శిక్షను తొలగిస్తే నిశ్చయంగా, మీరు చేస్తూ వచ్చిందే మళ్ళీ చేస్తారు.

మేము శిక్షించటం కోసం గట్టిగా పట్టుకున్న రోజు, మేము నిశ్చయంగా, ప్రతీకారం చేస్తాము.

మరియు వాస్తవంగా, వారికి పూర్వం మేము ఫిర్ఔన్ జాతి వారిని పరీక్షకు గురి చేశాము. మరియు వారి వద్దకు గౌరవనీయుడైన ప్రవక్త వచ్చి ఉన్నాడు.

(అతను ఇలా అన్నాడు): "అల్లాహ్ దాసులను నాకు అప్పగించు.[1] నేను మీ వద్దకు పంపబడిన నమ్మకస్తుణ్ణయిన సందేశహరుణ్ణి.

మరియు మీరు అల్లాహ్ ముందు అహంభావాన్ని (ఔన్నత్యాన్ని) చూపకండి. నిశ్చయంగా, నేను మీ వద్దకు స్పష్టమైన ప్రమాణం తీసుకొని వచ్చాను.

మరియు నిశ్చయంగా, నేను నా ప్రభువు మరియు మీ ప్రభువు (అయిన) అల్లాహ్ యొక్క శరణు పొందాను, - మీరు నన్ను రాళ్లు రువ్వి చంపకుండా ఉండటానికి.

ఒకవేళ మీరు నా మాట నమ్మకపోయినా సరే! నా జోలికి మాత్రం రాకండి!"

చివరకు అతను తన ప్రభువున ఇలా ప్రార్థించాడు: "నిశ్చయంగా, ఈ జనులు చాలా అపరాధులు!"

(అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు): "నీవు నా దాసులను తీసుకొని రాత్రివేళ బయలు దేరు, నిశ్చయంగా మీరు వెంబడించబడతారు.

మరియు సముద్రాన్ని చీల్చి నెమ్మదిగా వెళ్ళిపో.[1] నిశ్చయంగా, ఆ సైనికులు అందులో మునిగిపోతారు!"

వారు ఎన్నో తోటలను మరియు చెలమలను వెనుక విడిచి పోయారు;

మరియు ఎన్నో పంటపొలాలను మరియు గొప్ప భవనాలను;

మరియు వారు అనుభవిస్తూ ఉన్న ఎన్నో సుఖసంతోషాలను కూడా!

ఈ విధంగా, (వారి ముగింపు జరిగింది). మరియు మేము వాటికి ఇతర జాతి వారిని వారసులుగా చేశాము.

కాని, వారి కొరకు ఆకాశం గానీ, భూమి గానీ విలపించలేదు మరియు వారికి ఎలాంటి వ్యవధి కూడా ఇవ్వబడలేదు.

మరియు వాస్తవంగా! మేము ఇస్రాయీల్ సంతతి వారిని అవమానకరమైన శిక్ష నుండి విముక్తి కలిగించాము -

ఫిర్ఔన్ నుండి నిశ్చయంగా, అతడు మితిమీరి ప్రవర్తించేవారి, అగ్రగణ్యుడు.

మరియు వాస్తవానికి మాకు తెలిసి ఉండి కూడా మేము వారిని లోకంలో (ఆ కాలపు) సర్వజనులపై ఎన్నుకున్నాము. [1]

మరియు మేము వారికి అద్భుత సూచనలను (ఆయాత్ లను) ఒసంగి ఉంటిమి. అందులో వారికి స్పష్టమైన పరీక్ష ఉండింది.

నిశ్చయంగా, వీరు (ఖురైషులు) ఇలా అంటున్నారు:

"వాస్తవానికి, మాకు ఈ మొదటి మరణం మాత్రమే ఉంది, ఆ తరువాత మేము తిరిగి బ్రతికించబడము.

మీరు సత్యవంతులే అయితే, మా తాతముత్తాతలను లేపి తీసుకురండి!" [1]

వారు మేలైన వారా? లేక తుబ్బఅ జాతివారు[1] మరియు వారి కంటే పూర్వం వారా? మేము వారందరినీ నాశనం చేశాము. నిశ్చయంగా, వారందరూ అపరాధులే!

మేము ఈ ఆకాశాలను మరియు భూమిని మరియు వాటి మధ్యనున్న సమస్తాన్నీ ఆట (కాలక్షేపం) కొరకు సృష్టించలేదు.[1]

మేము వాటిని ఒక లక్ష్యంతోనే సృష్టించాము, కాని చాలా మందికి ఇది తెలియదు.[1]

నిశ్చయంగా, తీర్పుదినం వారందరి కొరకు ఒక నిర్ణీత దినం.[1]

ఆ దినమున ఏ స్నేహితుడు కూడా మరొక స్నేహితునికి ఏ మాత్రం ఉపయోగపడడు. మరియు వారికి ఎలాంటి సహాయమూ లభించదు.[1]

అల్లాహ్ కరుణించిన వానికి తప్ప! నిశ్చయంగా, ఆయనే సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత.

నిశ్చయంగా, జఖ్ఖూమ్ వృక్షఫలం;

పాపులకు ఆహారంగా ఇవ్వబడుతుంది;

మరిగే నూనే (సీసం) వలే,[1] అది వారి కడుపులో మరుగుతుంది;

సలసల కాగే నీటిలాగా!

(ఇలా అనబడుతుంది): "ఇతనిని పట్టుకొని భగభగ మండే నరకాగ్ని మధ్యలోకి ఈడ్వండి;

ఆ తరువాత అతని నెత్తి మీద సలసల కాగే నీటి శిక్షను పోయండి.

దీనిని రుచి చూడు; నిశ్చయంగా, నీవు శక్తిమంతుడివిగా, గౌరవనీయుడివిగా ఉండేవాడివి కదా!"

నిశ్చయంగా, ఇదే మీరు సందేహంలో పడి వున్న విషయం!

నిశ్చయంగా, దైవభీతి గలవారు శాంతి భద్రతలు గల స్థలంలో ఉంటారు.

ఉద్యానవనాలలో మరియు చెలమల మధ్య.

వారు, మృదువైన పట్టువస్త్రాలు మరియు బంగారు (జరీ) పట్టు వస్త్రాలు ధరించి, ఒకరికొకరు ఎదురెదురుగా కూర్చొని ఉంటారు.[1]

ఇలా ఉంటుంది వారి స్థితి! మరియు మేము వారిని అందమైన, ప్రకాశవంతమైన కళ్ళు గల వారితో (హూర్ లతో) వివాహం చేయిస్తాము.[1]

వారక్కడ శాంతియుతంగా ఉంటూ అనేక రకాలైన ఫలాలను అడుగుతుంటారు. [1]

వారక్కడ మరణాన్ని[1] ఎన్నడూ రుచి చూడరు; వారి మొదటి (ఇహలోక) మరణం తప్ప! మరియు ఆయన వారిని భగభగమండే అగ్నిశిక్ష నుండి కాపాడాడు;

నీ ప్రభువు అనుగ్రహం వల్ల. ఇదే ఆ గొప్ప సాఫల్యం!

అందుకే నిశ్చయంగా, మేము (ఈ ఖుర్ఆన్ ను) నీ భాషలో సులభం చేశాము. ఇలాగైనా వారు అర్థం చేసుకుంటారని (హితబోధ గ్రహిస్తారని).[1]

కావున, నీవు నిరీక్షించు! నిశ్చయంగా వారు కూడా నిరీక్షిస్తున్నారు.