The Noble Qur'an Encyclopedia
Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languagesThe private apartments [Al-Hujraat] - Telugu translation - Abder-Rahim ibn Muhammad
Surah The private apartments [Al-Hujraat] Ayah 18 Location Madanah Number 49
ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త అనుమతికి ముందే నిర్ణయాలకు దిగకండి.[1] అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ అంతా వినేవాడు, సర్వజ్ఞుడు.
ఓ విశ్వాసులారా! మీ కంఠస్వరాలను, ప్రవక్త కంఠస్వరాని కంటే పెంచకండి మరియు మీరు పరస్పరం ఒకరితో నొకరు విచ్చలవిడిగా మాట్లాడుకునే విధంగా అతనితో మాట్లాడకండి, దాని వల్ల మీకు తెలియకుండానే, మీ కర్మలు వ్యర్థం కావచ్చు!
నిశ్చయంగా, ఎవరైతే అల్లాహ్ యొక్క సందేశహరుని సన్నిధిలో తమ కంఠస్వరాలను తగ్గిస్తారో, అలాంటి వారి హృదయాలను అల్లాహ్ భయభక్తుల కొరకు పరీక్షించి ఉన్నాడు. వారికి క్షమాపణ మరియు గొప్ప ప్రతిఫలం ఉంటాయి.
(ఓ ప్రవక్తా!) నిశ్చయంగా, ఎవరైతే, నిన్ను గృహాల బయట నుండి బిగ్గరగా (అరుస్తూ) పిలుస్తారో, వారిలో చాలా మంది బుద్ధిహీనులే.[1]
మరియు ఒకవేళ వారు నీవు బయటకు వచ్చే వరకు ఓపిక పట్టి వుంటే, అది వారికే మేలై ఉండేది. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
ఓ విశ్వాసులారా! ఎవడైనా ఒక అవిధేయుడు (ఫాసిఖ్), మీ వద్దకు ఏదైనా వార్త తెస్తే, మీరు - మీకు తెలియకుండానే జనులకు నష్టం కలిగించి, మీరు చేసిన దానికి పశ్చాత్తాప పడవలసిన స్థితి రాకముందే - నిజానిజాలను విచారించి తెలుసుకోండి.[1]
మరియు మీ మధ్య అల్లాహ్ యొక్క సందేశహరుడు ఉన్నాడనే విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. ఒకవేళ అతన చాలా విషయాలలో మీ మాటనే వింటే మీరే ఆపదలో పడవచ్చు. కానీ అల్లాహ్ మీకు విశ్వాసం పట్ల ప్రేమ కలిగించాడు మరియు దానిని మీ హృదయాలకు ఆకర్షణీయమైనదిగా చేశాడు. మరియు సత్యతిరస్కారాన్ని, అవిధేయతను మరియు దుర్నడతను (ఆజ్ఞోల్లంఘనను) మీకు అసహ్యకరమైనదిగా చేశాడు. అలాంటి వారే సరైన మార్గదర్శకత్వం పొందినవారు.
అది అల్లాహ్ తరఫు నుండి వారికి లభించిన అనుగ్రహం మరియు ఉపకారం. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.
మరియు ఒకవేళ విశ్వాసులలోని రెండు వర్గాల వారు పరస్పరం కలహించుకుంటే, వారిద్దరి మధ్య సంధి చేయించండి. కాని ఒకవేళ, వారిలోని ఒక వర్గం వారు రెండవ వర్గం వారిపై దౌర్జన్యం చేస్తే, దౌర్జన్యం చేసిన వారు, అల్లాహ్ ఆజ్ఞ వైపునకు మరలే వరకు, వారికి వ్యతిరేకంగా పోరాడండి.[1] తరువాత వారు మరలి వస్తే, వారి మధ్య న్యాయంగా సంధి చేయించండి మరియు నిష్పక్షపాతంగా వ్యవహరించండి. నిశ్చయంగా, అల్లాహ్ నిష్పక్షపాతంగా వ్యవహరించే వారిని ప్రేమిస్తాడు.
వాస్తవానికి విశ్వాసులు పరస్పరం సహోదరులు, కావున మీ సహోదరుల మధ్య సంధి చేయించండి.[1] మరియు మీరు కరుణించ బడాలంటే అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి.
ఓ విశ్వాసులారా! మీలో ఎవరూ (పురుషులు) ఇతరులెవరినీ ఎగతాళి చేయరాదు. బహుశా వారే (ఎగతాళి చేయబడే వారే) వీరి కంటే శ్రేష్ఠులు కావచ్చు![1] అదే విధంగా స్త్రీలు కూడా ఇతర స్త్రీలను ఎగతాళి చేయరాదు. బహశా వారే (ఎగతాళి చేయబడే స్త్రీలే) వీరి కంటే శ్రేష్ఠురాండ్రు కావచ్చు! మీరు పరస్పరం ఎత్తి పొడుచుకోకండి మరియు చెడ్డ పేర్లతో పిలుచుకోకండి. విశ్వసించిన తర్వాత ఒకనిని చెడ్డ పేరుతో పిలవటం ఎంతో నీచమైన విషయం మరియు (ఇలా చేసిన పిదప) పశ్చాత్తాప పడకుంటే, అలాంటి వారు చాలా దుర్మార్గులు.[2]
ఓ విశ్వాసులారా! అతిగా అనుమానించడం నుండి దూరంగా ఉండండి, ఎందుకంటే కొన్ని అనుమానాలే నిశ్చయంగా పాపాలు. మరియు మీరు మీ పరస్పర రహస్యాలను తెలుసుకోవటానికి ప్రయత్నించకండి మరియు చాడీలు చెప్పుకోకండి. మీలో ఎవడైనా చచ్చిన తన సోదరుని మాంసం తినడానికి ఇష్టపడతాడా? మీరు దానిని అసహ్యించుకుంటారు కదా! అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణా ప్రదాత.
ఓ మానవులారా! నిశ్చయంగా మేము మిమ్మల్ని ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ నుండి పుట్టించాము. మరియు మీరు ఒకరి నొకరు గుర్తించుకోవటానికి మిమ్మల్ని జాతులుగా మరియు తెగలుగా చేశాము.[1] నిశ్చయంగా, మీలో ఎక్కువ దైవభీతి గలవాడే, అల్లాహ్ దగ్గర ఎక్కువ గౌరవం గలవాడు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, సర్వం తెలిసినవాడు.
ఎడారి వాసులు (బద్దూలు): "మేము విశ్వసించాము." అని అంటారు. (ఓ ముహమ్మద్!) వారితో ఇలా అను: "మీరు ఇంకా విశ్వసించలేదు కావున: 'మేము విధేయులం (ముస్లింలం) అయ్యాము.' అని అనండి. ఎందుకంటే విశ్వాసం (ఈమాన్) మీ హృదయాలలోకి ఇంకా ప్రవేశించలేదు. ఒకవేళ మీరు అల్లాహ్ యొక్క మరియు ఆయన ప్రవక్త యొక్క ఆజ్ఞాపాలన చేస్తే, ఆయన మీ కర్మలను ఏ మాత్రం వృథా కానివ్వడు. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత."
వాస్తవానికి, ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను విశ్వసించి, ఆ తరువాత ఏ అనుమానానికి లోను కాకుండా, అల్లాహ్ మార్గంలో, తమ సిరిసంపదలతో మరియు ప్రాణాలతో పోరాడుతారో! అలాంటి వారు, వారే! సత్యవంతులు.
వారితో ఇలా అను: "ఏమిటి? మీరు అల్లాహ్ కు మీ ధర్మస్వీకారం గురించి తెలియజేస్తున్నారా? ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ కు బాగా తెలుసు. మరియు అల్లాహ్ కు ప్రతి విషయం గురించి బాగా తెలుసు."
(ఓ ముహమ్మద్!) వారు ఇస్లాంను స్వీకరించి, నీకు ఉపకారం చేసినట్లు వ్యవహరిస్తున్నారు. వారితో ఇలా అను: "మీరు ఇస్లాంను స్వీకరించి నాకు ఎలాంటి ఉపకారం చేయలేదు! వాస్తవానికి, మీరు సత్యవంతులే అయితే! మీకు విశ్వాసం వైపునకు మార్గదర్శకత్వం చేసి, అల్లాహ్ యే మీకు ఉపకారం చేశాడని తెలుసుకోండి."
నిశ్చయంగా, అల్లాహ్! ఆకాశాలలో మరియు భూమిలోనున్న అగోచర విషయాలన్నింటినీ ఎరుగును. మరియు మీరు చేసేదంతా అల్లాహ్ చూస్తున్నాడు.