عربيEnglish

The Noble Qur'an Encyclopedia

Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languages

Mount Sinai [At-tur] - Telugu translation - Abder-Rahim ibn Muhammad

Surah Mount Sinai [At-tur] Ayah 49 Location Maccah Number 52

తూర్ పర్వతం సాక్షిగా![1]

వ్రాయబడిన గ్రంథం సాక్షిగా!

విప్పబడిన చర్మపత్రం మీద.[1]

చిరకాల సందర్శనాలయం సాక్షిగా![1]

పైకెత్తబడిన కప్పు (అంతరిక్షం) సాక్షిగా![1]

ఉప్పొంగే సముద్రం సాక్షిగా![1]

నిశ్చయంగా, నీ ప్రభువు శిక్ష సంభవించ నున్నది.

దానిని తప్పించేవాడు ఎవ్వడు లేడు.

ఆకాశాలు భయంకరంగా కంపించే రోజు!

మరియు పర్వతాలు దారుణంగా చలించినప్పుడు!

అప్పుడు, ఆ రోజు అసత్యవాదులకు వినాశం ఉంది.

ఎవరైతే వృథా మాటలలో కాలక్షేపం చేస్తూ ఉంటారో!

వారు నరకాగ్నిలోకి నెట్టుతూ త్రోయబడే రోజు;

(వారితో ఇలా అనబడుతుంది): "మీరు అసత్యమని నిరాకరిస్తూ వుండిన నరకాగ్ని ఇదే!

ఏమీ? ఇది మంత్రజాలమా? లేక దీనిని మీరు చూడలేక పోతున్నారా?

ఇందులో మీరు కాలుతూ ఉండండి. దానికి మీరు సహనం వహించినా, సహనం వహించక పోయినా అంతా మీకు సమానమే! నిశ్చయంగా, మీ కర్మలకు తగిన ప్రతిఫలమే మీకు ఇవ్వబడుతున్నది."

నిశ్చయంగా, భయభక్తులు గలవారు స్వర్గవనాలలో సుఖసంతోషాలలో ఉంటారు.

వారి ప్రభువు వారికి ప్రసాదించిన వాటిని హాయిగా అనుభవిస్తూ ఉంటారు. మరియు వారి ప్రభువు వారిని భగభగ మండే నరకాగ్ని శిక్ష నుండి కాపాడాడు.

(వారితో ఇలా అనబడుతుంది): "మీరు చేస్తూ వుండిన కర్మలకు ఫలితంగా హాయిగా తినండి త్రాగండి!"

వారు వరుసగా వేయబడిన ఆసనాల మీద, దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు. మరియు మేము అందమైన పెద్ద పెద్ద కన్నులు గల సుందరీమణులతో[1] వారి వివాహం చేయిస్తాము.

మరియు ఎవరైతే విశ్వసిస్తారో మరియు వారి సంతానంవారు విశ్వాసంలో వారిని అనుసరిస్తారో! అలాంటి వారిని వారి సంతానంతో (స్వర్గంలో) కలుపుతాము.[1] మరియు వారి కర్మలలో వారికి ఏ మాత్రం నష్టం కలిగించము. ప్రతి వ్యక్తి తాను సంపాదించిన దానికి తాకట్టుగా ఉంటాడు.[2]

మరియు మేము వారికి, వారు కోరే ఫలాలను మరియు మాంసాన్ని పుష్కలంగా ప్రసాదిస్తాము.

అందులో (ఆ స్వర్గంలో) వారు ఒకరి కొకరు (మధు) పాత్ర మార్చుకుంటూ ఉంటారు; దాన్ని (త్రాగటం) వల్ల వారు వ్యర్థపు మాటలు మాట్లాడరు మరియు పాపాలు చేయరు.[1]

మరియు దాచబడిన ముత్యాల వంటి బాలురు,[1] వారి సేవ కొరకు వారి చుట్టు ప్రక్కలలో తిరుగుతూ ఉంటారు.

మరియు వారు ఒకరి వైపుకొకరు మరలి పరస్పరం (తమ గతించిన జీవితాలను గురించి) మాట్లాడుకుంటూ ఉంటారు.

వారు ఇలా అంటారు: "వాస్తవానికి మనం ఇంతకు పూర్వం మన కుటుంబం వారి మధ్య ఉన్నప్పుడు (అల్లాహ్ శిక్షకు) భయపడుతూ ఉండేవారము.

కావున నిశ్చయంగా, అల్లాహ్ మన మీద కనికరం చూపాడు మరియు మమ్ము దహించే గాలుల శిక్ష నుండి కాపాడాడు.[1]

నిశ్చయంగా, మనం ఇంతకు పూర్వం ఆయననే ప్రార్థిస్తూ ఉండేవారము. నిశ్చయంగా, ఆయన మహోపకారి,[1] అపార కరుణా ప్రదాత.

కావున (ఓ ప్రవక్తా!) నీవు హితోపదేశం చేస్తూ వుండు. నీ ప్రభువు అనుగ్రహం వల్ల నీవు జ్యోతిష్కుడవు కావు మరియు పిచ్చివాడవూ కావు.

లేదా? వారు: "ఇతను ఒక కవి, ఇతని వినాశకాలం కోసం మేము ఎదురు చూస్తున్నాము. అని అంటున్నారా?"[1]

వారితో ఇలా అను: "మీరు ఎదురు చూస్తూ ఉండండి, నిశ్చయంగా, నేను కూడా మీతో పాటు ఎదురు చూస్తూ ఉంటాను!"

ఏమీ? వారి బుద్ధులు వారికి ఇవే ఆజ్ఞాపిస్తున్నాయా? లేక వారు తలబిరుసుతనం గల జనులా?[1]

ఏమీ? వారు: "ఇతనే, దీనిని (ఈ సందేశాన్ని) కల్పించుకున్నాడు" అని అంటున్నారా? అలా కాదు, వారు అసలు విశ్వసించ దలుచుకోలేదు!

వారు సత్యవంతులే అయితే దీని వంటి ఒక వచనాన్ని (రచించి) తెమ్మను.[1]

వారు ఏ (సృష్టికర్త) లేకుండానే సృష్టింపబడ్డారా? లేక వారే సృష్టికర్తలా?

లేక వారు ఆకాశాలను మరియు భూమిని సృష్టించారా? అలా కాదు, అసలు వారికి విశ్వాసం లేదు.

వారి దగ్గర నీ ప్రభువు కోశాగారాలు ఏవైనా ఉన్నాయా? లేక వారు వాటికి అధికారులా?

వారి దగ్గర నిచ్చెన ఏదైనా ఉందా? దానితో పైకెక్కి వారు (దేవదూతల మాటలు) వినటానికి? అలా అయితే! వారిలో ఎవడైతే విన్నాడో, అతనిని స్పష్టమైన నిదర్శనాన్ని తెమ్మను.

ఆయన (అల్లాహ్) కు కూతుళ్ళూ మరియు మీకేమో కుమారులా?[1]

(ఓ ముహమ్మద్!) నీవు వారితో ఏమైనా ప్రతిఫలం అడుగుతున్నావా? వారు ఋణభారంతో అణిగి పోవటానికి?

లేక వారి దగ్గర అగోచర విషయపు జ్ఞానముందా? వారు దానిని వ్రాసి పెట్టారా?[1]

లేక వారేదైనా పన్నాగం పన్నదలచారా? కాని ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తారో, వారే పన్నాగానికి గురి అవుతారు.[1]

లేక వారికి అల్లాహ్ గాకుండా మరొక ఆరాధ్య దేవుడు ఉన్నాడా? వారు కల్పించే భాగస్వాములకు అల్లాహ్ అతీతుడు.

ఒకవేళ వారు ఆకాశపు ఒక తునకను రాలి పడటం చూసినా: "ఇవి దట్టమైన మేఘాలు!" అని అనేవారు.

కావున వారు తమ (తీర్పు) దినాన్ని దర్శించే వరకు వారిని వదిలి పెట్టు. అప్పుడు వారు భీతితో మూర్ఛపోయి పడి పోతారు.

ఆరోజు వారి పన్నాగం వారికి ఏ మాత్రం పనికి రాదు. మరియు వారికి ఎలాంటి సహాయం కూడా లభించదు.

మరియు నిశ్చయంగా, దుర్మార్గానికి పాల్పడిన వారికి, ఇదే గాక మరొక శిక్ష కూడా ఉంది,[1] కాని వారిలో చాలా మందికి అది తెలియదు.

కావున (ఓ ముహమ్మద్!) నీవు, నీ ప్రభువు ఆజ్ఞ వచ్చే వరకు సహనం వహించు. నిశ్చయంగా, నీవు మా దృష్టిలో ఉన్నావు. మరియు నీవు నిద్ర నుండి లేచినపుడు నీ ప్రభువు పవిత్రతను కొనియాడు, ఆయన స్తోత్రం చెయ్యి.

మరియు రాత్రి వేళలో కూడా ఆయన పవిత్రతను కొనియాడు[1] మరియు నక్షత్రాలు అస్తమించే వేళలో కూడాను![2]