The Noble Qur'an Encyclopedia
Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languagesThe Event, The Inevitable [Al-Waqia] - Telugu translation - Abder-Rahim ibn Muhammad
Surah The Event, The Inevitable [Al-Waqia] Ayah 96 Location Maccah Number 56
ఆ అనివార్య సంఘటన సంభవించినపుడు,[1]
అది సంభవించటంలో ఎలాంటి సందేహం (అసత్యం) లేదు.
అది కొందరిని హీనపరుస్తుంది, మరికొందరిని పైకెత్తుతుంది[1].
భూమి తీవ్ర కంపనంతో కంపించినపుడు;
మరియు పర్వతాలు పొడిగా మార్చబడినపుడు;
అప్పుడు వాటి దుమ్ము నలువైపులా నిండి పోయినపుడు;
మరియు మీరు మూడు వర్గాలుగా విభజింపబడతారు.
ఇక కుడిపక్షం వారు, ఆ కుడిపక్షము వారు ఎంత (అదృష్టవంతులు)![1]
మరికొందరు వామపక్షం వారుంటారు, ఆ వామపక్షపు వారు ఎంత (దౌర్భాగ్యులు)![1]
మరియు (ఇహలోకంలో విశ్వాసంలో) ముందున్న వారు (స్వర్గంలో కూడా) ముందుంటారు.
అలాంటి వారు (అల్లాహ్) సాన్నిధ్యాన్ని పొందుతారు.
వారు సర్వసుఖాలు గల స్వర్గవనాలలో ఉంటారు.
మొదటి తరాల వారిలో నుండి చాలా మంది;
మరియు తరువాత తరాల వారిలో నుండి కొంతమంది.
(బంగారు) జలతారు అల్లిన ఆసనాల మీద;
ఒకరికొకరు ఎదురెదురుగా, వాటి మీద దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు.[1]
వారి చుట్టుప్రక్కలలో చిరంజీవులైన (నిత్యబాల్యం గల) బాలురు (సేవకులు) తిరుగుతూ ఉంటారు.
(మధువు) ప్రవహించే చెలమల నుండి నింపిన పాత్రలు, గిన్నెలు మరియు కప్పులతో!
దాని వలన వారికి తలనొప్పి గానీ లేక మత్తు గానీ కలుగదు.
మరియు వారు కోరే పండ్లు, ఫలాలు ఉంటాయి.
మరియు వారు ఇష్టపడే పక్షుల మాంసం.[1]
మరియు అందమైన కన్నులు గల సుందరాంగులు (హూరున్);
దాచబడిన ముత్యాల వలే!
ఇదంతా వారు చేస్తూ ఉండిన వాటికి (సత్కార్యాలకు) ప్రతిఫలంగా!
అందులో వారు వ్యర్థమైన మాటలు గానీ, పాప విషయాలు గానీ వినరు.[1]
"శాంతి (సలాం) శాంతి (సలాం)!" అనే మాటలు తప్ప![1]
మరియు కుడి పక్షం వారు, ఆ కుడి పక్షం వారు ఎంత (అదృష్టవంతులు)!
వారు ముళ్ళు లేని సిదర్ వృక్షాల మధ్య ![1]
మరియు పండ్ల గెలలతో నిండిన అరటి చెట్లు;
మరియు వ్యాపించి ఉన్న నీడలు,[1]
మరియు ఎల్లప్పుడు ప్రవహించే నీరు;
మరియు సమృద్ధిగా ఉన్న పండ్లు, ఫలాలు;
ఎడతెగకుండా మరియు అంతం కాకుండా (ఉండే వనాలలో);
మరియు ఎత్తైన ఆసనాల మీద (కూర్చొని) ఉంటారు.[1]
నిశ్చయంగా, మేము వారిని ప్రత్యేక సృష్టిగా సృష్టించాము;
మరియు వారిని (నిర్మలమైన) కన్యలుగా చేశాము;[1]
వారు ప్రేమించేవారు గానూ, సమ వయస్సుగల వారు గానూ (ఉంటారు);[1]
కుడిపక్షం వారి కొరకు.
అందులో చాలా మంది మొదటి తరాలకు చెందిన వారుంటారు;
మరియు తరువాత తరాల వారిలో నుండి చాలా మంది ఉంటారు.
ఇక వామ(ఎడమ) పక్షం వారు; ఆ వామపక్షం వారు ఎంత (దౌర్భాగ్యులు)?
వారు దహించే నరకాగ్నిలో మరియు సలసలకాగే నీటిలో;
మరియు నల్లటి పొగఛాయలో (ఉంటారు).
అది చల్లగానూ ఉండదు మరియు ఓదార్చేదిగానూ ఉండదు;
నిశ్చయంగా, వారు ఇంతకు ముందు చాలా భోగభాగ్యాలలో పడి ఉండిరి;
మరియు వారి మూర్ఖపు పట్టుతో ఘోరమైన పాపాలలో పడి ఉండిరి;
మరియు వారు ఇలా అనేవారు: "ఏమీ? మేము మరణించి, మట్టిగా మరియు ఎముకలుగా మారిపోయిన తరువాత కూడా మరల బ్రతికించి లేపబడతామా?
మరియు పూర్వీకులైన మా తాతముత్తాతలు కూడానా?
వారితో ఇలా అను: "నిశ్చయంగా, పూర్వీకులు మరియు తరువాత వారు కూడానూ!
వారందరూ ఆ నిర్ణీత రోజు, ఆ సమయమున సమావేశ పరచబడతారు.
ఇక నిశ్చయంగా, మార్గభ్రష్టులైన ఓ అసత్యవాదులారా!
మీరు జఖ్ఖూమ్ చెట్టు (ఫలాల) ను తింటారు.[1]
దానితో కడుపులు నింపుకుంటారు.
తరువాత, దాని మీద సలసల కాగే నీరు త్రాగుతారు.
వాస్తవానికి మీరు దానిని దప్పిక గొన్న ఒంటెల వలే త్రాగుతారు.
తీర్పుదినం నాడు (ఈ వామపక్షం వారికి లభించే) ఆతిథ్యం ఇదే!
మిమ్మల్ని మేమే సృష్టించాము; అయితే మీరెందుకు ఇది సత్యమని నమ్మరు?
ఏమీ? మీరెప్పుడైనా, మీరు విసర్జించే వీర్యబిందువును గమనించారా?
ఏమీ? మీరా, దానిని సృష్టించేవారు? లేక మేమా దాని సృష్టికర్తలము?
మేమే మీ కోసం మరణం నిర్ణయించాము మరియు మమ్మల్ని అధిగమించేది ఏదీ లేదు;
మీ రూపాలను మార్చి వేసి మీరు ఎరుగని (ఇతర రూపంలో) మిమ్మల్ని సృష్టించటం నుండి.
మరియు వాస్తవానికి మీ మొదటి సృష్టిని గురించి మీరు తెలుసుకున్నారు; అయితే మీరెందుకు గుణపాఠం నేర్చుకోరు?
మీరు నాటే, విత్తనాలను గురించి, మీరెప్పుడైనా ఆలోచించారా?
మీరా వాటిని పండించేది? లేక మేమా వాటిని పండించే వారము?
మేము తలచుకుంటే, దానిని పొట్టుగా మార్చి వేయగలము. అప్పుడు మీరు ఆశ్చర్యంలో పడి పోతారు."
(మీరు అనేవారు): "నిశ్చయంగా, మేము పాడై పోయాము!
కాదు, కాదు, మేము దరిద్రుల మయ్యాము! అని.
ఏమీ? మీరెప్పుడైనా మీరు త్రాగే నీటిని గురించి ఆలోచించారా?
మీరా దానిని మేఘాల నుండి కురిపించే వారు? లేక మేమా దానిని కురిపించేవారము?
మేము తలచుకుంటే దానిని ఎంతో ఉప్పుగా ఉండేలా చేసేవారము! అయినా మీరెందుకు కృతజ్ఞతలు చూపరు?
మీరు రాజేసే అగ్నిని గమనించారా?
దాని వృక్షాన్ని పుట్టించినవారు మీరా? లేక దానిని ఉత్పత్తి చేసినది మేమా?[1]
మేము దానిని (నరకాగ్నిని), గుర్తు చేసేదిగా మరియు ప్రయాణీకులకు (అవసరం గలవారికి) ప్రయోజనకారిగా చేశాము.[1]
కావున సర్వత్తముడైన నీ ప్రభువు నామాన్ని స్తుతించు.
ఇక నేను నక్షత్రాల స్థానాల (కక్ష్యల) సాక్షిగా చెబుతున్నాను.
మరియు నిశ్చయంగా, మీరు గమనించగలిగితే, ఈ శపథం ఎంతో గొప్పది!
నిశ్చయంగా, ఈ ఖుర్ఆన్ దివ్యమైనది.
సురక్షితమైన[1] గ్రంథంలో ఉన్నది.
దానిని[1] పరిశుద్ధులు తప్ప మరెవ్వరూ తాకలేరు.
ఇది సర్వలోకాల ప్రభువు తరఫు నుండి అవతరింప జేయబడింది.
ఏమీ? మీరు ఈ సందేశాన్ని[1] తేలికగా తీసుకుంటున్నారా?
మరియు (అల్లాహ్) మీకు ప్రసాదిస్తున్న జీవనోపాధికి (కృతజ్ఞతలు) చూపక, వాస్తవానికి ఆయనను మీరు తిరస్కరిస్తున్నారా?[1]
అయితే (చనిపోయేవాడి) ప్రాణం గొంతులోనికి వచ్చినపుడు, మీరెందుకు (ఆపలేరు)?
మరియు అప్పుడు మీరు (ఏమీ చేయలేక) చూస్తూ ఉండిపోతారు.
మరియు అప్పుడు మేము అతనికి మీకంటే చాలా దగ్గరలో ఉంటాము, కాని మీరు చూడలేక పోతారు.[1]
ఒకవేళ మీరు ఎవరి అదుపాజ్ఞలో (ఆధీనంలో) లేరనుకుంటే;
మీరు సత్యవంతులే అయితే దానిని (ఆ ప్రాణాన్ని) ఎందుకు తిరిగి రప్పించుకోలేరు?
కాని అతడు (మరణించేవాడు), (అల్లాహ్) సాన్నిధ్యాన్ని పొందినవాడైతే![1]
అతని కొరకు సుఖసంతోషాలు మరియు తృప్తి మరియు పరమానందకరమైన స్వర్గవనం ఉంటాయి.
మరియు ఎవడైతే కుడిపక్షం వారికి చెందినవాడో![1]
అతనితో: "నీకు శాంతి కలుగుగాక (సలాం)! నీవు కుడిపక్షం వారిలో చేరావు." (అని అనబడుతుంది).
మరియు ఎవడైతే, అసత్యవాదులు, మార్గభ్రష్టులైన వారిలో చేరుతాడో![1]
అతని ఆతిథ్యానికి సలసల కాగే నీరు ఉంటుంది.
మరియు భగభగమండే నరకాగ్ని ఉంటుంది.
నిశ్చయంగా, ఇది రూఢి అయిన నమ్మదగిన సత్యం!
కావున సర్వత్తముడైన నీ ప్రభువు పేరును స్తుతించు.[1]