The Noble Qur'an Encyclopedia
Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languagesExile [Al-Hashr] - Telugu translation - Abder-Rahim ibn Muhammad
Surah Exile [Al-Hashr] Ayah 24 Location Madanah Number 59
ఆకాశాలలో నున్న సమస్తమూ మరియు భూమిలో నున్న సమస్తమూ, అల్లాహ్ పవిత్రతను కొనియాడుతుంటాయి. మరియు ఆయనే సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు.
గ్రంథ ప్రజలలోని సత్యతిరస్కారులను మొదట సమీకరించిన (బనూ నదీర్ తెగ) వారిని, వారి గృహాల నుండి వెళ్లగొట్టినవాడు ఆయనే.[1] వారు వెళ్ళిపోతారని మీరు ఏ మాత్రం భావించలేదు. మరియు అల్లాహ్ నుండి తమను తమ కోటలు తప్పక రక్షిస్తాయని వారు భావించారు! కాని అల్లాహ్ (శిక్ష) వారు ఊహించని వైపు నుండి, వారిపై వచ్చి పడింది. మరియు ఆయన వారి హృదయాలలో భయం కలుగజేశాడు, కావున వారు తమ ఇండ్లను తమ చేతులారా మరియు విశ్వాసుల చేతులతో కూడా, నాశనం చేయించుకున్నారు. కావున ఓ పరిజ్ఞానం (కళ్ళు) గల వారలారా! గుణపాఠం నేర్చుకోండి.
మరియు ఒకవేళ అల్లాహ్ వారి విషయంలో దేశ బహిష్కారం వ్రాసి ఉండకపోతే, వారిని ఈ ప్రపంచములోనే శిక్షిచి ఉండేవాడు. మరియు వారికి పరలోకంలో నరకాగ్ని శిక్ష పడుతుంది.
ఇది ఎందుకంటే, వారు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను వ్యతిరేకించారు. మరియు అల్లాహ్ ను వ్యతిరేకించిన వాడిని శిక్షించటంలో నిశ్చయంగా, అల్లాహ్ చాలా కఠినుడు.
(ఓ విశ్వాసులారా!) మీరు ఏ ఖర్జూరపు చెట్లను నరికివేశారో[1] లేక ఏ ఖర్జూరపు చెట్లను వాటి వ్రేళ్ళ మీద నిలబడేలా వదలి పెట్టారో, అంతా అల్లాహ్ ఆజ్ఞతోనే జరిగింది. మరియు ఇదంతా అవిధేయులను అవమానించటానికి జరిగిన విషయం.
మరియు అల్లాహ్ తన ప్రవక్తకు వారి నుండి ఇప్పించిన ఫయ్అ కొరకు, మీరు గుర్రాలను గానీ ఒంటెలను గానీ పరిగెత్తించలేదు.[1] కాని అల్లాహ్ తాను కోరిన వారిపై, తన సందేశహరునికి ఆధిక్యత నొనంగుతాడు. మరియు అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు.
అల్లాహ్ తన ప్రవక్తకు ఆ నగరవాసుల నుండి ఇప్పించిన దానిలో (ఫయ్అ లో) అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు మరియు అతని దగ్గరి బంధువులకు మరియు అనాథులకు మరియు పేదలకు మరియు బాటసారులకు హక్కు ఉంది.[1] అది మీలో ధనవంతులైన వారి మధ్యనే తిరగకుండా ఉండటానికి, ఇలా నిర్ణయించబడింది. మరియు ప్రవక్త మీకు ఇచ్చిన దానిని తీసుకోండి మరియు అతను మీకు నిషేధించిన దానికి దూరంగా ఉండండి. అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ శిక్షించటంలో చాలా కఠినుడు.
(దానిలో నుండి కొంతభాగంపై) తమ ఇండ్ల నుండి మరియు తమ ఆస్తిపాస్తుల నుండి వెడలగొట్టబడి, వలస వచ్చిన (ముహాజిర్ లకు) పేదవారికి కూడా హక్కు ఉంది. వారు అల్లాహ్ అనుగ్రహాన్ని మరియు ఆయన ప్రసన్నతను కోరుతున్నారు. మరియు వారు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు సహాయం చేస్తున్నారు. ఇలాంటి వారు, వీరే సత్యవంతులు.[1]
మరియు ఎవరైతే - ఈ (వలస వచ్చినవారు) రాకపూర్వమే - విశ్వసించి వలస కేంద్రం (మదీనా)లో నివసిస్తూ ఉండేవారో! వారికి కూడా హక్కు వుంది.[1] వారు తమ వద్దకు వలస వచ్చిన వారిని ప్రేమిస్తారు. మరియు వారు (వలస వచ్చిన) వారికి ఏది ఇవ్వబడినా! దాని అవసరం తమకు ఉన్నట్లు భావించరు. మరియు తమకు అవసరమున్నా వారికి తమ సొంత (అవసరాల) మీద ప్రాధాన్యతనిస్తారు. మరియు ఎవరైతే అత్మలోభం నుండి రక్షింప బడతారో! అలాంటి వారు, వారే! సాఫల్యం పొందేవారు. [2]
మరియు ఎవరైతే వారి తరువాత వచ్చారో! వారికి అందులో హక్కు ఉంది. వారు ఇలా అంటారు: "ఓ మా ప్రభూ! మమ్మల్ని మరియు మాకంటే ముందు విశ్వసించిన మా సోదరులను క్షమించు. మరియు మా హృదయాలలో విశ్వాసుల పట్ల ద్వేషాన్ని కలిగించకు.[1] ఓ మా ప్రభూ! నిశ్చయంగా, నీవు చాలా కనికరించేవాడవు, అపార కరుణా ప్రదాతవు!"
(ఓ ముహమ్మద్!) కపట విశ్వాసుల గురించి నీకు తెలియదా?[1] వారు గ్రంథ ప్రజలలో సత్యతిరస్కారులైన తమ సోదరులతో, ఇలా అంటారు: "ఒకవేళ మీరు వెళ్ళగొట్ట బడినట్లయితే, మేము కూడా తప్పక మీతోబాటు వెళ్తాము. మరియు మీ విషయంలో మేము ఎవ్వరి మాటా వినము. ఒకవేళ మీతో యుద్ధం జరిగితే, మేము తప్పక మీకు సహాయపడతాము." మరియు నిశ్చయంగా, వారు అసత్యవాదులు, అల్లాహ్ యే దీనికి సాక్షి!
కాని (వాస్తవానికి) వారు (యూదులు) వెడలగొట్టబడితే, వీరు (ఈ కపట విశ్వాసులు) వారి వెంట ఎంతమాత్రం వెళ్ళరు మరియు వారితో యుద్ధం జరిగితే, (ఈ కపట విశ్వాసులు) వారికి ఏ మాత్రం సహాయపడరు.[1] ఒకవేళ వీరు, వారికి (యూదులకు) సహాయపడినా, వారు తప్పక వెన్నుచూపి పారిపోతారు. ఆ తరువాత వారు విజయం (సహాయం) పొందలేరు.
వారి హృదయాలలో, అల్లాహ్ భయం కంటే, మీ భయమే ఎక్కువ ఉంది. ఇది ఎందుకంటే! వాస్తవానికి వారు అర్థం చేసుకోలేని జనులు.
వారందరూ కలిసి కూడా, దృఢమైన కోటలు గల నగరాలలోనో, లేదా గోడల చాటు నుండో తప్ప, మీతో యుద్ధం చేయజాలరు. వారి మధ్య ఒకరి మీద ఒకరికి ఉన్న ద్వేషం, ఎంతో తీవ్రమైనది. వారు కలసి ఉన్నట్లు నీవు భావిస్తావు, కాని వారి హృదయాలు చీలి పోయి ఉన్నాయి. ఇది ఎందుకంటే, వాస్తవానికి వారు బుద్ధిహీనులైన జనులు.
వీరి దృష్టాంతం సమీపంలోనే గడిచిన వారిని (బనూ ఖైనుఖాఅ లను) పోలి ఉంది. వారు తమ కార్యాల ఫలితాన్ని చవి చూశారు, మరియు (పరలోకంలో) వారికి బాధాకరమైన శిక్ష ఉంది.[1]
వారి దృష్టాంతం మానవుణ్ణి ప్రేరేపిస్తూ, ఇలా అనే ఆ షైతాన్ వలే ఉంది. అతడు: "సత్యాన్ని తిరస్కరించు." అని అంటాడు. అతడు తిరస్కరించిన తరువాత ఇలా అంటాడు: "నిశ్చయంగా, నాకు నీతో ఏ విధమైన సంబంధం లేదు, నిశ్చయంగా, నేను సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కు భయపడేవాడిని!"[1]
తరువాత ఆ ఇద్దరి పర్యవసానం, నిశ్చయంగా, ఆ ఇరువురూ నరకాగ్నిలో ఉండటమే! అందు వారు శాశ్వతంగా ఉంటారు. మరియు దుర్మార్గులకు లభించే ప్రతిఫలం ఇదే!
ఓ విశ్వాసులారా! అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. మరియు ప్రతి వ్యక్తి, తాను రేపటి కొరకు ఏమి సమకూర్చుకున్నాడో చూసుకోవాలి మరియు అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, మీరు చేసేదంతా అల్లాహ్ ఎరుగును!
మరియు అల్లాహ్ ను మరచి పోయిన వారి మాదిరిగా మీరూ అయి పోకండి. అందువలన ఆయన వారిని, తమను తాము మరచిపోయేటట్లు చేశాడు. అలాంటి వారు! వారే అవిధేయులు (ఫాసిఖూన్).
నరకవాసులు మరియు స్వర్గవాసులు సరిసమానులు కాజాలరు. స్వర్గవాసులు, వారే! విజయం పొందేవారు.
ఒకవేళ మేము ఈ ఖుర్ఆన్ ను ఏ పర్వతం పైనైనా అవతరింపజేసి ఉంటే, అల్లాహ్ భయం వల్ల అది అణిగి బ్రద్దలై పోవటాన్ని నీవు చూసి ఉంటావు. మరియు బహుశా ప్రజలు ఆలోచిస్తారని, ఇలాంటి దృష్టాంతాలను మేము వారి ముందు పెడుతున్నాము.
ఆయనే, అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు! ఆయనకు అగోచర మరియు గోచర విషయాలన్నీ తెలుసు.[1] ఆయన అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత.
ఆయనే, అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయన విశ్వసార్వభౌముడు, పరమ పవిత్రుడు, శాంతికి మూలాధారుడు, శాంతి ప్రదాత, శరణమిచ్చేవాడు, సర్వశక్తిమంతుడు, నిరంకుశుడు, గొప్పవాడు. వారు కల్పించే భాగస్వాములకు అల్లాహ్ అతీతుడు. [1]
ఆయనే, అల్లాహ్! విశ్వసృష్టికర్త, ప్రతిదానిని సృజించేవాడు మరియు రూపాలను తీర్చిదిద్దేవాడు. ఆయనకు సర్వశ్రేష్ఠమైన పేర్లున్నాయి.[1] ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న సమస్తమూ, ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉంటాయి. మరియు ఆయనే సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు.