عربيEnglish

The Noble Qur'an Encyclopedia

Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languages

Mutual Disillusion [At-Taghabun] - Telugu translation - Abder-Rahim ibn Muhammad

Surah Mutual Disillusion [At-Taghabun] Ayah 18 Location Madanah Number 64

ఆకాశాలలో నున్న సమస్తమూ మరియు భూమిలో నున్న సమస్తమూ, అల్లాహ్ పవిత్రతను కొనియాడుతుంటాయి. విశ్వసామ్రాజ్యాధిపత్యం ఆయనదే మరియు సర్వస్తోత్రాలు ఆయనకే. మరియు ఆయనే ప్రతిదీ చేయగల సమర్ధుడు.

ఆయనే మిమ్మల్ని సృష్టించాడు. మీలో కొందరు సత్యతిరస్కారులున్నారు మరియు మీలో కొందరు విశ్వాసులున్నారు మరియు మీరు చేసేదంతా అల్లాహ్ చూస్తున్నాడు.[1]

ఆయన ఆకాశాలను మరియు భూమిని సత్యంతో సృష్టించాడు మరియు మిమ్మల్ని ఉత్తమ రూపంలో రూపొందించాడు.[1] మరియు మీ గమ్యస్థానం ఆయన వైపునకే ఉంది.

ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా ఆయనకు తెలుసు. మరియు మీరు దాచేది మరియు వెలిబుచ్చేది అంతా ఆయకు బాగా తెలుసు. మరియు అల్లాహ్ కు హృదయాలలో దాగి ఉన్నదంతా తెలుసు.

ఇంతకు పూర్వం, సత్యాన్ని తిరస్కరించి, తమ కర్మల దుష్ఫలితాన్ని చవి చూసిన వారి వృత్తాంతం మీకు అందలేదా? మరియు వారికి (పరలోకంలో) బాధాకరమైన శిక్ష ఉంటుంది.

దీనికి కారణమేమిటంటే, వాస్తవానికి వారి వద్దకు వారి ప్రవక్తలు, స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చినప్పటికీ, వారు: "ఏమీ? మాకు మానవులు మార్గదర్శకత్వం చేస్తారా[1]?" అని పలుకుతూ సత్యాన్ని తిరస్కరించి మరలి పోయారు. మరియు అల్లాహ్ కూడా వారిని నిర్లక్ష్యం చేశాడు. మరియు అల్లాహ్ స్వయం సమృద్ధుడు, సర్వస్తోత్రాలకు అర్హుడు.

సత్యాన్ని తిరస్కరించిన వారు (చనిపోయిన తరువాత) మరల సజీవులుగా లేపబడమని భావిస్తున్నారు. వారితో ఇలా అను: "అది కాదు, నా ప్రభువు సాక్షిగా! మీరు తప్పకుండా లేపబడతారు[1]. తరువాత మీరు (ప్రపంచంలో) చేసిందంతా మీకు తెలుపబడుతుంది. మరియు ఇది అల్లాహ్ కు ఎంతో సులభం."

కావున మీరు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను మరియు మేము అవతరింపజేసిన జ్యోతిని (ఈ ఖుర్ఆన్ ను) విశ్వసించండి. మరియు మీరు చేసేదంతా అల్లాహ్ బాగా ఎరుగును.

(జ్ఞాపకముంచుకోండి) సమావేశపు రోజున ఆయన మీ అందరిని సమావేశపరుస్తాడు[1]. అదే లాభనష్టాల దినం. మరియు ఎవడైతే అల్లాహ్ ను విశ్వసించి, సత్కార్యాలు చేస్తాడో, అలాంటి వాని పాపాలను ఆయన తొలగిస్తాడు. మరియు అతనిని క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు, వారందులో శాశ్వతంగా కలకాలం ఉంటారు. అదే గొప్ప విజయం.

మరియు ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తారో మరియు మా సూచన (ఆయాత్) లను అబద్ధాలని నిరాకరిస్తారో, అలాంటి వారు నరకవాసులవుతారు. అందు వారు శాశ్వతంగా ఉంటారు. మరియు అది ఎంత చెడ్డ గమ్యస్థానం!

ఏ ఆపద కూడా, అల్లాహ్ అనుమతి లేనిదే సంభవించదు. మరియు ఎవడైతే అల్లాహ్ ను విశ్వసిస్తాడో, అల్లాహ్ అతని హృదయానికి మార్గదర్శకత్వం చేస్తాడు. మరియు అల్లాహ్ కు ప్రతి విషయం గురించి బాగా తెలుసు.

మీరు అల్లాహ్ కు విధేయులై ఉండండి మరియు సందేశహరుణ్ణి అనుసరించండి. ఒకవేళ మీరు మరలిపోతే, (తెలుసుకోండి) వాస్తవానికి మా సందేశహరుని బాధ్యత కేవలం (మా సందేశాన్ని) మీకు స్పష్టంగా అందజేయటం మాత్రమే!

అల్లాహ్! ఆయన తప్ప, మరొక ఆరాధ్యుడు లేడు! మరియు విశ్వాసులు కేవలం అల్లాహ్ మీదే నమ్మకం ఉంచుకోవాలి!

ఓ విశ్వాసులారా! నిశ్చయంగా, మీ సహవాసులు (అజ్వాజ్) మరియు మీ సంతానంలో మీ శత్రువులుండవచ్చు! కావున మీరు వారి పట్ల జాగ్రత్త వహించండి. కాని ఒకవేళ మీరు వారి అపరాధాన్ని మన్నించి వారిని ఉపేక్షించి వారిని క్షమించితే! నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత (అని తెలుసుకోండి).

నిశ్చయంగా, మీ సంపదలు మరియు మీ సంతానం మీ కొరకు ఒక పరీక్ష మరియు అల్లాహ్! ఆయన దగ్గర గొప్ప ప్రతిఫలం (స్వర్గం) ఉంది[1].

కావున మీరు మీ శక్తి మేరకు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండి, (ఆయన సూచనలను విని), ఆయనకు విధేయులై ఉండండి మరియు (మీ ధనం నుండి) దానం చేస్తే! అది మీ సొంత మేలుకే. మరియు ఎవరైతే తమ హృదయ లోభత్వం నుండి రక్షణ పొందుతారో, అలాంటి వారే సాఫల్యం పొందేవారు.[1]

ఒకవేళ మీరు అల్లాహ్ కు అప్పుగా మంచి అప్పు ఇస్తే, ఆయన దానిని ఎన్నో రెట్లు పెంచి తిరిగి మీకు ప్రసాదిస్తాడు మరియు మిమ్మల్ని క్షమిస్తాడు. వాస్తవానికి అల్లాహ్ కృతజ్ఞతలను ఆమోదించేవాడు, సహనశీలుడు.

ఆయన అగోచర మరియు గోచర విషయాలన్నీ బాగా తెలిసినవాడు, అపార శక్తిసంపన్నుడు, మహా వివేకవంతుడు.