عربيEnglish

The Noble Qur'an Encyclopedia

Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languages

The Pen [Al-Qalam] - Telugu translation - Abder-Rahim ibn Muhammad

Surah The Pen [Al-Qalam] Ayah 52 Location Maccah Number 68

నూన్[1][2], కలం సాక్షిగా! మరియు వారు (దేవదూతలు) వ్రాస్తున్న దాని సాక్షిగా[3]!

నీ ప్రభువు అనుగ్రహం వలన నీవు (ఓ ముహమ్మద్) పిచ్చివాడవు కావు!

మరియు నిశ్చయంగా, నీకు ఎన్నటికీ తరిగిపోని ప్రతిఫలం ఉంది.

మరియు నిశ్చయంగా, నీవు ఉత్తమమైన శీలవంతుడవు[1]!

కావున త్వరలోనే నీవు చూడగలవు మరియు వారు కూడా చూడగలరు;

మీలో ఎవరికి పిచ్చి ఉందో!

నిశ్చయంగా, నీ ప్రభువు! ఆయనకు ఎవడు మార్గభ్రష్టుడయ్యాడో తెలుసు మరియు ఎవడు సన్మార్గం మీద ఉన్నాడో కూడా ఆయనకు బాగా తెలుసు!

కావున నీవు ఈ అసత్యవాదులను అనుసరించకు.

ఒకవేళ నీవు (ధర్మం విషయంలో) మెత్తపడితే వారు కూడా మెత్తపడ గోరుతున్నారు.[1]

కావున నీవు ప్రమాణాలు చేసే ప్రతి నీచుడిని అనుసరించకు;

చాడీలు చెప్పేవాడిని, ఎత్తి పొడుస్తూ ఉండేవాడిని;

మంచిని నిరోధించేవాడిని, హద్దు మీరి ప్రవర్తించే పాపిష్ఠుడిని;

నిర్ధయుడిని, ఇంతే గాకుండా అపఖ్యాతి గల (నిందార్హుడైన) వాడిని;

వాడు ధనవంతుడూ మరియు సంతాన భాగ్యంతో తలతూగుతూ ఉన్నవాడు అయినా సరే!

ఒకవేళ వాడికి మా సూచనలు (ఆయాత్) వినిపిస్తే, అందుకు వాడు: "ఇవి పూర్వకాలపు కట్టుకథలే!" అని అంటాడు.

మేము త్వరలోనే వాడి ముక్కు మీద వాత పెడ్తాము.

నిశ్చయంగా, మేము ఆ తోటవారిని పరీక్షించినట్లుగా వీరిని కూడా పరీక్షిస్తాము. ఎవరైతే తెల్లవారగానే తప్పక దాని పంట కోసుకుందామని ప్రతిజ్ఞ చేసుకున్నారో!

మరియు (అల్లాహ్ కోరితే) అనే, మినహాయింపుకు తావు ఇవ్వకుండా!

కావున వారు పడుకొని ఉండగానే నీ ప్రభువు తరఫు నుండి దానిపై (ఆ తోటపై) ఒక ఆపద వచ్చి పడింది.

దాంతో తెల్లవారే సరికి అది (ఆ తోట) పంట కోసిన పొలం వలే మారి పోయింది.

తరువాత ఉదయం లేచి వారు ఒకరితో నొకరు ఇలా చెప్పుకోసాగారు:

"మీరు పంటను కోయదలుచుకుంటే ఉదయమే మీ పొలానికి వెళ్ళండి."

ఆ తరువాత వారు ఒకరితోనొకరు (ఈ విధంగా) మెల్లగా చెప్పుకుంటూ బయలు దేరారు.

"ఈ రోజు ఏ పేదవాడిని కూడా మీ దగ్గరకు రానివ్వకండి!"

మరియు వారు (పేదవారిని) దగ్గరకు రానివ్వకూడదని గట్టి నిర్ణయంతో తెల్లవారు ఝామున బయలు దేరారు.

వారు దానిని (తోటను) చూసి ఇలా వాపోయారు: "నిశ్చయంగా, మనం దారి తప్పాము!

కాదు! కాదు! మనం సర్వం కోల్పోయాము!"

వారిలో మధ్యరకానికి చెందినవాడు ఇలా అన్నాడు: "ఏమీ? నేను మీతో అనలేదా? మీరు ఎందుకు ఆయన (అల్లాహ్) పవిత్రతను కొనియాడరని ('ఇన్ షా అల్లాహ్!' అనరని)[1]?"

వారు ఇలా అన్నారు: "మా ప్రభువు సర్వలోపాలకూ అతీతుడు! నిశ్చయంగా, మేమే దుర్మార్గులము!"

తరువాత వారు అభిముఖులై ఒకరి నొకరు నిందించుకోసాగారు.

వారు ఇలా వాపోయారు: "అయ్యో! మా పాడుగాను! నిశ్చయంగా, మేము తలబిరుసుతనం చూపాము!

బహశా! మన ప్రభువు మనకు దీనికి బదులుగా దీని కంటే శ్రేష్ఠమైన దానిని ప్రసాదించ వచ్చు! నిశ్చయంగా, మనం మన ప్రభువు వైపునకు (పశ్చాత్తాపంతో) మరలుదాము!"

ఈ విధంగా ఉంటుంది శిక్ష! మరియు పరలోక శిక్ష దీని కంటే ఘోరంగా ఉంటుంది. వారు ఇది తెలుసుకుంటే ఎంత బాగుండేది!

నిశ్చయంగా, దైవభీతి గలవారికి వారి ప్రభువు వద్ద పరమానందకరమైన స్వర్గవనాలు ఉంటాయి.

ఏమీ? మేము విధేయులను (ముస్లింలను) నేరస్థులతో సమానంగా ఎంచుదుమా[1]?

మీకేమయింది? మీరు ఏ విధమైన నిర్ణయాలు చేస్తున్నారు?

మీ వద్ద ఏదయినా (దివ్య) గ్రంథముందా? దాని నుండి మీరు నేర్చుకోవటానికి!

నిశ్చయంగా, అందులో మీకు, మీరు కోరేదంతా ఉందని?

లేక, పునరుత్థాన దినం వరకు, మీరు నిర్ణయించుకున్నదే మీకు తప్పక లభిస్తుందని, మేము మీతో చేసిన గట్టి ప్రమాణం ఏదైనా ఉందా?

వారిలో దీనికి ఎవడు హామీగా ఉన్నాడో అడుగు.

లేక, వారికి ఎవరైనా (వారు అల్లాహ్ కు కల్పించిన) భాగస్వాములు ఉన్నారా? ఒకవేళ వారు సత్యవంతులే అయితే తమ ఆ భాగస్వాములను తీసుకు రమ్మను.

(జ్ఞాపకముంచుకోండి) ఏ రోజయితే పిక్క ఎముక తెరిచి వేయబడుతుందో! మరియు వారు సాష్టాంగం (సజ్దా) చేయటానికి పిలువబడతారో, అప్పుడు వారు (కపట విశ్వాసులు), అలా (సజ్దా) చేయలేరు!

వారి చూపులు క్రిందికి వాలిపోయి ఉంటాయి, అవమానం వారిని ఆవరించి ఉంటుంది. మరియు వాస్తవానికి వారు నిక్షేపంగా ఉన్నప్పుడు సాష్టాంగం (సజ్దా) చేయటానికి ఆహ్వానించబడితే (తిరస్కరించేవారు)!

కావున నన్ను మరియు ఈ సందేశాన్ని అబద్ధమని తిరస్కరించే వారిని వదలండి. వారు గ్రహించని విధంగా మేము వారిని క్రమక్రమంగా (వినాశం వైపునకు) తీసుకొని పోతాము[1].

మరియు నేను వారికి కొంత వ్యవధి నిస్తున్నాను. నిశ్చయంగా, నా పన్నాగం చాలా దృఢమైనది[1].

లేక, (ఓ ప్రవక్తా!) నీవు వారిని ఏదైనా ప్రతిఫలం ఇవ్వమని అడుగుతున్నావా? వారికి దాని రుణం భారమవటానికి?

లేక, వారి వద్ద ఏదైనా అగోచర జ్ఞానం ఉందా[1]? వారు దానిని వ్రాసి పెట్టడానికి?

కావున నీవు నీ ప్రభువు ఆజ్ఞ కొరకు వేచి ఉండు. మరియు నీవు, చేపవాని (యూనుస్) వలే వ్యవహరించకు[1]. (గుర్తుకు తెచ్చుకో) అతను దుఃఖంలో ఉన్నప్పుడు (తన ప్రభువును) మొర పెట్టుకున్నాడు.

అతని ప్రభువు అనుగ్రహమే గనక అతనికి అందక పోయి ఉంటే, అతను అవమానకరమైన స్థితిలో (చేప కడుపులో పడి ఉండేవాడు కాని మేము అతనిని క్షమించాము). కావున అతను చౌట (బంజరు) మైదానంలో విసరి వేయ బడ్డాడు[1].

చివరకు అతని ప్రభువు అతనిని ఎన్నుకొని సత్పురుషులలో చేర్చాడు.

మరియు ఆ సత్యతిరస్కారులు, ఈ సందేశాన్ని (ఖుర్ఆన్ ను) విన్నప్పుడు, తమ చూపులతో నీ కాళ్ళు ఊడగొడతారా అన్నట్లు (నిన్ను జారించి పడవేసేటట్లు) నిన్ను చూస్తున్నారు[1]. మరియు వారు నిన్ను (ఓ ముహమ్మద్!): "నిశ్చయంగా ఇతడు పిచ్చివాడు!" అని అంటున్నారు.

కాని సర్వలోకాల (వారికి) ఇదొక హితోపదేశం మాత్రమే!