عربيEnglish

The Noble Qur'an Encyclopedia

Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languages

The Ascending stairways [Al-Maarij] - Telugu translation - Abder-Rahim ibn Muhammad

Surah The Ascending stairways [Al-Maarij] Ayah 44 Location Maccah Number 70

ప్రశ్నించేవాడు[1], ఆ అనివార్యమైన శిక్షను గురించి ప్రశ్నించాడు;

సత్యతిరస్కారులకు విధించబడే దాని గురించి; దానిని ఎవ్వడూ తొలగించలేడు.

అది ఆరోహణ మార్గాలకు యజమానుడైన అల్లాహ్ తరఫు నుండి వస్తుంది[1].

యాభై వేల సంవత్సరాలకు సమానమైన (ప్రమాణం గల) ఒక రోజులో[1], దేవదూతలు మరియు ఆత్మ (జిబ్రీల్)[2] ఆయన వద్దకు అధిరోహిస్తారు.

కావున (ఓ ముహమ్మద్!) నీవు సహనం వహించు, ఉత్తమమైన సహనంతో!

వాస్తవానికి, వారు (ప్రజలు) అది (ఆ దినం) దూరంగా ఉందని అనుకుంటున్నారు.

కాని మాకది అతి దగ్గరలో కనిపిస్తోంది.

ఆ రోజు ఆకాశం మరిగే సీసం వలే (నూనే వలే) అయి పోతుంది.

మరియు కొండలు ఏకిన ఉన్ని వలె అయి పోతాయి[1].

మరియు ప్రాణ స్నేహితుడు కూడా తన స్నేహితుని (క్షేమాన్ని) అడగడు.

వారు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఆ రోజు అపరాధి తన సంతానాన్ని పరిహారంగా ఇచ్చి అయినా శిక్ష నుండి తప్పించుకోగోరుతాడు;

మరియు తన సహవాసిని మరియు తన సోదరుణ్ణి;

మరియు తనకు ఆశ్రయమిచ్చిన దగ్గరి బంధువులను;

మరియు భూమిలో ఉన్న వారినందరినీ కూడా ఇచ్చి అయినా, తాను విముక్తి పొందాలని కోరుతాడు.

కాని అలా కానేరదు! నిశ్చయంగా, ఆ మండే అగ్నిజ్వాల (అతని కొరకు వేచి ఉంటుంది)!

అది అతని చర్మాన్ని పూర్తిగా వలచి కాల్చి వేస్తుంది.

అది (సత్యం నుండి) వెనుదిరిగి మరియు వెన్ను చూపి, పోయేవారిని (అందరినీ) పిలుస్తుంది.

మరియు (ధనాన్ని) కూడబెట్టి, దానిని దాచేవారిని.

నిశ్చయంగా, మానవుడు ఆత్రగాడుగా (తొందరపడేవాడిగా) సృష్టించబడ్డాడు;

తనకు కీడు కలిగినప్పుడు వాడు ఆందోళన చెందుతాడు;

మరియు తనకు మేలు కలిగినపుడు స్వార్థపరునిగా ప్రవర్తిస్తాడు.

నమాజ్ ను ఖచ్ఛితంగా పాఠించేవారు తప్ప!

ఎవరైతే తమ నమాజ్ ను సదా నియమంతో పాటిస్తారో;

మరియు అలాంటి వారు, ఎవరైతే తమ సంపదలలో (ఇతరులకు) ఉన్న హక్కును సమ్మతిస్తారో![1]

యాచకులకు మరియు లేమికి గురి అయిన వారికి;[1]

మరియు అలాంటి వారికి, ఎవరైతే తీర్పుదినాన్ని సత్యమని నమ్ముతారో;

మరియు ఎవరైతే తమ ప్రభువు శిక్షకు భయపడుతారో!

నిశ్చయంగా, వారి ప్రభువు యొక్క ఆ శిక్ష; దాని పట్ల ఎవ్వరూ నిర్భయంగా ఉండలేరు!

మరియు ఎవరైతే, తమ మర్మాంగాలను కాపాడుకుంటారో -

తమ భార్యలు (అజ్వాజ్), లేదా ధర్మసమ్మతంగా తమ ఆధీనంలో ఉన్న (బానిస) స్త్రీలతో తప్ప[1] - అలాంటప్పుడు వారు నిందార్హులు కారు.

కాని ఎవరైతే వీటిని మించి పోగోరుతారో, అలాంటివారే మితిమీరి పోయేవారు.

మరియు ఎవరైతే తమ అమానతులను మరియు తమ వాగ్దానాలను కాపాడుకుంటారో;

మరియు ఎవరైతే తమ సాక్ష్యాల మీద స్థిరంగా ఉంటారో;

మరియు ఎవరైతే తమ నమాజులను కాపాడుకుంటారో;

ఇలాంటి వారంతా సగౌరవంగా స్వర్గవనాలలో ఉంటారు.

ఈ సత్యతిరస్కారులకు ఏమయ్యింది? వీరెందుకు హడావిడిగా, నీ ముందు ఇటూ అటూ తిరుగుతున్నారు?

కుడి ప్రక్క నుండి మరియు ఎడమ ప్రక్క నుండి గుంపులుగా;[1]

ఏమీ? వారిలో ప్రతి ఒక్కడూ, తాను పరమ సుఖాలు గల స్వర్గవనంలో ప్రవేశింప జేయబడతానని ఆశిస్తున్నాడా?

అలా కానేరదు! నిశ్చయంగా, మేము వారిని దేనితో పుట్టించామో వారికి బాగా తెలుసు!

కావున! నేను తూర్పుల మరియు పడమరల ప్రభువు శపథం చేసి చెబుతున్నాను[1]. నిశ్చయంగా, మేము అలా చేయగల సమర్థులము;

వారికి బదులుగా వారి కంటే ఉత్తమమైన వారిని వారి స్థానంలో తీసుకురావటానికి; మరియు మమ్మల్ని మించి పోయేవారు ఎవ్వరూ లేరు.

కావున వారిని - వారితో వాగ్దానం చేయబడిన ఆ దినానికి చేరే వరకు - వ్యర్థపు మాటలలో మరియు విలాస వినోదాల్లో విడిచిపెట్టు.

ఆ రోజు వారు తమ సమాధుల నుండి లేచి, తమ గమ్యస్థానాలకు చేరుకోవటానికి తొందర పడుతూ వేగంగా బయటికి వస్తారు.

వారి చూపులు క్రిందికి వాలి ఉంటాయి, అవమానం వారిని క్రమ్ముకొని ఉంటుంది. అదే వారికి వాగ్దానం చేయబడిన దినం!