عربيEnglish

The Noble Qur'an Encyclopedia

Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languages

The Jinn [Al-Jinn] - Telugu translation - Abder-Rahim ibn Muhammad

Surah The Jinn [Al-Jinn] Ayah 28 Location Maccah Number 72

(ఓ ప్రవక్తా!) ఇలా అను: "నాకు ఈ విధంగా దివ్యసందేశం పంపబడింది; నిశ్చయంగా, ఒక జిన్నాతుల సమూహం[1] - దీనిని (ఈ ఖుర్ఆన్ ను) విని - తమ జాతి వారితో ఇలా అన్నారు: 'వాస్తవానికి మేము ఒక అద్భుతమైన పఠనం (ఖుర్ఆన్) విన్నాము!

అది సరైన మార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తుంది. కావున మేము దానిని విశ్వసించాము[1]. మరియు మేము మా ప్రభువుకు ఎవ్వడిని కూడా భాగస్వామిగా సాటి కల్పించము.

మరియు నిశ్చయంగా, మా ప్రభువు వైభవం ఎంతో ఉన్నతమైనది. ఆయన ఎవ్వడినీ భార్యగా (సాహిబతున్ గా) గానీ, కుమారునిగా గానీ చేసుకోలేదు.

మరియు నిశ్చయంగా, మనలోని అవివేకులు, కొందరు అల్లాహ్ విషయంలో దారుణమైన మాటలు పలుకుతున్నారు.

మరియు వాస్తవానికి మనం మానవులు గానీ, జిన్నాతులు గానీ అల్లాహ్ ను గురించి అబద్ధం పలకరని భావించేవారము.

మరియు వాస్తవానికి, మానవులలో నుండి కొందరు పురుషులు, జిన్నాతులలో నుండి కొందరు పురుషుల శరణు వేడుతూ ఉండేవారు. ఈ విధంగా వారు, వారి (జిన్నాతుల) తలబిరుసుతనం మరింత అధికమే చేసేవారు[1].

మరియు వాస్తవానికి, వారు (మానవులు) కూడా మీరు (జిన్నాతులు) భావించినట్లు, అల్లాహ్ ఎవ్వడినీ కూడా సందేశహరునిగా పంపడని భావించారు.

మరియు నిశ్చయంగా, మేము ఆకాశాలలో (రహస్యాలను) తొంగి చూడటానికి ప్రయత్నించినపుడు, మేము దానిని కఠినమైన కావలివారితో మరియు అగ్ని జ్వాలలతో నిండి ఉండటాన్ని చూశాము[1].

మరియు వాస్తవానికి పూర్వం అక్కడి మాటలు వినటానికి మేము రహస్యంగా అక్కడ కూర్చునేవారం[1]. కాని ఇప్పుడు ఎవడైనా (రహస్యంగా) వినే ప్రయత్నం చేస్తే, అతడి కొరకు అక్కడ ఒక అగ్నిజ్వాల పొంచి ఉంటుంది[2].

మరియు వాస్తవానికి భూమిలో ఉన్న వారికి ఏదైనా కీడు ఉద్దేశింపబడిందా, లేక వారి ప్రభువు వారికి సరైన మార్గం చూపగోరుతున్నాడా అనే విషయం మాకు అర్థం కావడం లేదు.

మరియు వాస్తవానికి, మనలో కొందరు సద్వర్తనులున్నారు, మరికొందరు దానికి విరుద్ధంగా ఉన్నారు. వాస్తవానికి మనం విభిన్న మార్గాలను అనుసరిస్తూ వచ్చాము[1].

మరియు నిశ్చయంగా, మేము అల్లాహ్ నుండి భూలోకంలో తప్పించుకోలేము, అని అర్థం చేసుకున్నాము. మరియు పారిపోయి కూడా ఆయన నుండి తప్పించుకోలేము.

మరియు నిశ్చయంగా, మేము ఈ మార్గదర్శకత్వాన్ని (ఖుర్ఆన్ ను) విన్నప్పుడు దానిని విశ్వసించాము. కావున ఎవడైనా తన ప్రభువును విశ్వసిస్తాడో అతడికి తన సత్కర్మల ఫలితంలో నష్టాన్ని గురించీ మరియు శిక్షలో హెచ్చింపును గురించీ భయపడే అవసరం ఉండదు.

మరియు నిశ్చయంగా, మనలో కొందరు అల్లాహ్ కు విధేయులైన వారు (ముస్లింలు) ఉన్నారు. మరికొందరు నిశ్చయంగా, అన్యాయపరులు[1] (సత్యానికి దూరమైన వారు) ఉన్నారు. కావున ఎవరైతే అల్లాహ్ కు విధేయత (ఇస్లాం) ను అవలంబించారో, అలాంటి వారే సరైన మార్గాన్ని కనుగొన్న వారు!' "

మరియు అన్యాయపరులే (సత్యానికి దూరమైనవారు) నరకానికి ఇంధనమయ్యే వారు[1]!

ఒకవేళ వారు (సత్యతిరస్కారులు) ఋజుమార్గం మీద స్థిరంగా ఉన్నట్లైతే, మేము వారిపై పుష్కలంగా నీటిని కురిపించే వారము.

దాంతో వారిని పరీక్షించటానికి! మరియు ఎవడైతే తన ప్రభువు ధాన్యం నుండి విముఖుడవుతాడో, ఆయన వానిని తీవ్రమైన శిక్షకు గురి చేస్తాడు.

మరియు నిశ్చయంగా, మస్జిదులు అల్లాహ్ కొరకే ప్రత్యేకించబడ్డాయి. కావున వాటిలో అల్లాహ్ తో పాటు ఇతరులెవ్వరినీ ప్రార్థించకండి.

మరియు నిశ్చయంగా, అల్లాహ్ యొక్క దాసుడు (ముహమ్మద్) ఆయన (అల్లాహ్)ను ప్రార్థించటానికి నిలబడి నప్పుడు, వారు (జిన్నాతులు) అతన చుట్టు దట్టంగా (అతని ఖుర్ఆన్ పఠనాన్ని వినటానికి) గుమి గూడుతారు[1].

వారితో ఇలా అను: "నిశ్చయంగా నేను నా ప్రభువును మాత్రమే ప్రార్థిస్తాను మరియు ఆయనకు ఎవ్వరినీ సాటి కల్పించను[1]."

వారితో ఇలా అను: "నిశ్చయంగా, మీకు కీడు చేయటం గానీ, లేదా సరైన మార్గం చూపటం గానీ నా వశంలో లేదు."

ఇంకా ఇలా అను: "నిశ్చయంగా, నన్ను అల్లాహ్ నుండి ఎవ్వడునూ కాపాడలేడు మరియు నాకు ఆయన తప్ప మరొకరి ఆశ్రయం కూడా లేదు;

(నా పని) కేవలం అల్లాహ్ ఉపదేశాన్ని మరియు ఆయన సందేశాన్ని అందజేయటమే!" ఇక ఎవడైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఆజ్ఞను ఉల్లంఘిస్తాడో! అతడు నిశ్చయంగా, నరకాగ్నికి గురి అవుతాడు; అందులో శాశ్వతంగా కలకాలం ఉంటాడు.

చివరకు వారికి వాగ్దానం చేయబడిన దానిని వారు చూసినప్పుడు, ఎవరి సహాయకులు బలహీనులో, మరెవరి వర్గం సంఖ్యాపరంగా తక్కువో వారికి తెలిసి పోతుంది[1].

ఇలా అను: "మీకు వాగ్దానం చేయబడినది (శిక్ష) సమీపంలోనే రానున్నదో, లేక దాని కొరకు నా ప్రభువు దీర్ఘకాల వ్యవధి నియమించాడో నాకు తెలియదు."

ఆయనే అగోచర జ్ఞానం గలవాడు, కావున ఆయన అగోచర విషయాలు ఎవ్వడికీ తెలియజేయడు -

తాను కోరి ఎన్నుకొన్న ప్రవక్తకు తప్ప[1] - ఎందుకంటే, ఆయన నిశ్చయంగా, అతని (ఆ ప్రవక్త) ముందు మరియు వెనుక రక్షకభటులను నియమిస్తాడు.

వారు, (ప్రవక్తలు) తమ ప్రభువు యొక్క సందేశాలను యథాతథంగా అందజేస్తున్నారని పరిశీలించడానికి. మరియు ఆయన వారి అన్ని విషయాలను పరివేష్టించి ఉన్నాడు మరియు ఆయన ప్రతి ఒక్క విషయాన్ని లెక్క పెట్టి ఉంచుతాడు.