The Noble Qur'an Encyclopedia
Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languagesDefrauding [Al-Mutaffifin] - Telugu translation - Abder-Rahim ibn Muhammad
Surah Defrauding [Al-Mutaffifin] Ayah 36 Location Maccah Number 83
కొలతలలో, తూనికలలో తగ్గించి ఇచ్చే వారికి వినాశముంది.
వారు ప్రజల నుండి తీసుకునేటప్పుడు పూర్తిగా తీసుకుంటారు.
మరియు తాము ప్రజలకు కొలిచి గానీ లేక తూచి గానీ ఇచ్చేటప్పుడు మాత్రం తగ్గించి ఇస్తారు.[1]
ఏమీ? ఇలాంటి వారు తిరిగి బ్రతికించి లేపబడరని భావిస్తున్నారా?
ఒక గొప్ప దినమున!
సర్వ లోకాల ప్రభువు సమక్షంలో ప్రజలు అందరూ నిలబడే రోజు.[1]
అలా కాదు! నిశ్చయంగా, దుష్టుల కర్మపత్రం సిజ్జీనులో ఉంది.
ఆ సిజ్జీన్ అంటే నీవు ఏమనుకుంటున్నావు?
వ్రాసి పెట్టబడిన (చెరగని) గ్రంథం.[1]
సత్యాన్ని తిరస్కరించే వారికి ఆ రోజు వినాశముంది.
వారికే! ఎవరైతే తీర్పుదినాన్ని తిరస్కరిస్తారో!
మరియు మితిమీరి ప్రవర్తించే పాపిష్ఠుడు తప్ప, మరెవ్వడూ దానిని (తీర్పు దినాన్ని) తిరస్కరించడు.
మా సూచనలు (ఆయాత్ లు) అతడికి వినిపించ బడినప్పుడు అతడు: "ఇవి పూర్వకాలపు కట్టుకథలే!" అని అంటాడు.
అలా కాదు! వాస్తవానికి వారి హృదయాలకు వారి (దుష్ట) కార్యాల త్రుప్పు పట్టింది.[1]
అంతేకాదు, ఆ రోజు నిశ్చయంగా, వారు తమ ప్రభువు కారుణ్యం నుండి నిరోధింప బడతారు.
తరువాత వారు నిశ్చయంగా, భగభగ మండే నరకాగ్నిలోకి పోతారు.
అప్పుడు వారితో: "దేనినైతే మీరు అసత్యమని తిరస్కరిస్తూ వచ్చారో, అది ఇదే!" అని చెప్పబడుతుంది.
అలా కాదు! నిశ్చయంగా, ధర్మనిష్ఠాపరుల (పుణ్యాత్ముల) కర్మపత్రం మహోన్నత గ్రంథం (ఇల్లియ్యూన్)లో ఉంది.[1]
మరి ఆ ఇల్లియ్యూన్ అంటే నీవు ఏమనుకుంటున్నావు?
అది వ్రాసిపెట్టబడిన ఒక గ్రంథం.
దానికి, (అల్లాహ్ కు) సన్నిహితులైన వారు (దేవదూతలు) సాక్ష్యంగా ఉంటారు.[1]
నిశ్చయంగా, పుణ్యాత్ములు సుఖసంతోషాలలో ఉంటారు.
ఎత్తైన ఆసనాలపై కూర్చొని (స్వర్గదృశ్యాలను) తిలకిస్తూ.[1]
వారి ముఖాలు సుఖసంతోషాలతో కళకళలాడుతూ ఉండటం నీవు చూస్తావు.
సీలు చేయబడిన నాణ్యమైన మధువు వారికి త్రాగటానికి ఇవ్వబడుతుంది.[1]
దాని చివరి చుక్కలోనూ కస్తూరి సువాసన ఉంటుంది. కాబట్టి దానిని పొందటానికి అపేక్షించే వారంతా ప్రయాస పడాలి.
మరియు దానిలో (ఆ మధువులో) తస్నీమ్ కలుపబడి ఉంటుంది.[1]
అదొక చెలమ, (అల్లాహ్) సాన్నిధ్యం పొందినవారే దాని నుండి త్రాగుతారు.[1]
వాస్తవానికి (ప్రపంచంలో) అపరాధులు విశ్వసించిన వారిని హేళన చేసేవారు.
మరియు వీరు (విశ్వాసులు), వారి (అవిశ్వాసుల) యెదుట నుండి పోయి నప్పుడు, వారు (అవిశ్వాసులు) పరస్పరం కనుసైగలు చేసుకునేవారు.
మరియు (అవిశ్వాసులు) తమ ఇంటి వారి దగ్గరికి పోయినప్పుడు (విశ్వాసులను గురించి) పరిహసిస్తూ మరలేవారు.
మరియు (విశ్వాసులను) చూసినపుడల్లా: "నిశ్చయంగా, వీరు దారి తప్పినవారు!" అని అనేవారు.
మరియు వారు (అవిశ్వాసులు) వీరి (విశ్వాసుల) మీద కాపలాదారులుగా పంపబడలేదు!
కాని ఈ రోజు (పునరుత్థాన దినం నాడు) విశ్వసించినవారు, సత్యతిరస్కారులను చూసి నవ్వుతారు.
ఎత్తైన ఆసనాలపై కూర్చొని (స్వర్గదృశ్యాలను) తిలకిస్తూ (ఇలా అంటారు):
"ఇక! ఈ సత్యతిరస్కారులకు, వారి చేష్టలకు తగిన ప్రతిఫలం తప్ప మరేమైనా దొరుకునా?"