The Noble Qur'an Encyclopedia
Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languagesThe Dawn [Al-Fajr] - Telugu translation - Abder-Rahim ibn Muhammad
Surah The Dawn [Al-Fajr] Ayah 30 Location Maccah Number 89
ప్రాంతః కాలం సాక్షిగా![1]
పది రాత్రుల సాక్షిగా![1]
సరి బేసీల సాక్షిగా!
గడచిపోయే రాత్రి సాక్షిగా!
వీటిలో బుద్ధిగల వాని కొరకు ఏ ప్రమాణమూ లేదా ఏమిటి?[1]
నీ ప్రభువు ఆద్ (జాతి) వారి పట్ల ఎలా వ్యవహరించాడో నీకు తెలియదా?[1]
ఎత్తైన స్థంభాల (భవనాలు గల) ఇరమ్ ప్రజల పట్ల?[1]
వారిలాంటి జాతి భూమిలో ఎన్నడూ సృష్టించబడలేదు.[1]
మరియు లోయలలోని కొండరాళ్ళలో (భవనాలను) తొలిచిన సమూద్ జాతి పట్ల?[1]
మరియు మేకులవాడైన ఫిర్ఔన్ పట్ల?[1]
వారంతా ఆయా దేశాలలో తలబిరుసుతనంతో ప్రవర్తించారు;
మరియు వాటిలో దౌర్జన్యాన్ని రేకెత్తించారు.
కాబట్టి నీ ప్రభువు వారిపైకి అనేక రకాల బాధాకరమైన శిక్షలను పంపాడు.
వాస్తవానికి, నీ ప్రభువు మాటు వేసి ఉన్నాడు (అంతా కనిపెడ్తూ ఉంటాడు)!
అయితే మానవుడు ఎలాంటి వాడంటే: అతని ప్రభువు అతన్ని పరీక్షించటానికి, అతనికి గౌరవ ప్రతిష్టల నిచ్చి అనుగ్రహించి నప్పుడు: "నా ప్రభువు నన్ను గౌరవించాడు." అని అంటాడు;[1]
కాని, అతన్ని పరీక్షించటానికి, అతని ఉపాధిని తగ్గించినప్పుడు: "నా ప్రభువు నన్ను అవమానించాడు." అని అంటాడు.[1]
అలా కాదు, వాస్తవానికి మీరు అనాథులను ఆదరించరు;[1]
మరియు మీరు పేదలకు అన్నం పెట్టే విషయంలో ఒకరినొకరు ప్రోత్సహించుకోరు;[1]
మరియు వారసత్వపు ఆస్తిని పేరాశతో అంతా మీరే తినేస్తారు.
మరియు మీరు ధనవ్యామోహంలో దారుణంగా చిక్కుకు పోయారు![1]
అలా కాదు, భూమి, దంచి పిండిపిండిగా చేయబడినపుడు;
మరియు నీ ప్రభువు (స్వయంగా) వస్తాడు మరియు దేవదూతలు వరుసలలో వస్తారు.[1]
ఆ రోజు నరకం (ముందుకు) తీసుకు రాబడుతుంది. ఆ రోజు మానవుడు (తన కర్మలన్నీ) జ్ఞప్తికి తెచ్చుకుంటాడు; కాని ఆ రోజు జ్ఞప్తికి తెచ్చుకోవడం వల్ల అతనికి కలిగే ప్రయోజనమేమిటీ?
అతడు: "అయ్యో! నా పాడుగానూ! నా ఈ జీవితం కొరకు నేను (సత్కార్యాలు) చేసి పంపు కొని ఉంటే ఎంత బాగుండేది!" అని వాపోతాడు.
అయితే, ఆ రోజు, ఆయన (అల్లాహ్) శిక్షించినట్లు, మరెవ్వడూ శిక్షించలేడు!
మరియు ఆయన (అల్లాహ్) బంధించినట్లు, మరెవ్వడూ బంధించలేడు.[1]
(సన్మార్గునితో ఇలా అనబడుతుంది): "ఓ తృప్తి పొందిన ఆత్మా!
నీ ప్రభువు సన్నిధికి మరలి రా! (నీకు లభించే సత్ఫలితానికి) ఆనందిస్తూ మరియు (నీ ప్రభువునకు) ప్రియమైనదానివై!
నీవు (పుణ్యాత్ములైన) నా దాసులలో చేరిపో!
మరియు నీవు నా స్వర్గంలో ప్రవేశించు!"